
బై నెంబర్లతో పుట్టుకు వచ్చిన భూములు
54 ఎకరాల ప్రభుత్వ భూమి హాం ఫట్
రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే ప్రభుత్వ భూమి కబ్జా
భూ కబ్జాల వెనక కౌన్సిలర్ భర్త బాగోతాలపై క్రైమ్ మిర్రర్ కథనాలు
నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధి తుర్కయంజాల్ గ్రామంలోని సర్వే నెంబర్ 323 ప్రభుత్వ భూమి రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే కబ్జాకు గురవుతోంది. సర్వే నెంబర్ 323లో 55 .29 ఎకరాల ప్రభుత్వ భూమి (నోటిఫికేషన్ నెంబర్ యు / సెక్షన్ 22 – ఏ ) ఉండగా, ప్రస్తుతం అసలు సర్వే నెంబర్ 323 అన్నది రెవెన్యూ రికార్డుల్లోనే కన్పించకుండా పోయింది. అదే సర్వే నెంబర్ పరిధిలోని భూములను బై నెంబర్ల పేరిట కొంతమంది రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు కలిసి హాంఫట్ చేశారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. అసలు సర్వే నెంబర్ 323 రెవెన్యూ గెజిట్ లో ఉన్నప్పటికీ , బై నెంబర్లు ఎక్కడి నుంచి పుట్టుకువచ్చాయన్న ప్రశ్నకు సమాధానం లేకుండాపోయింది. బై నెంబర్ల పేరిట ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నా, వాటిని పర్యవేక్షిస్తూ, పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు వంతపాడుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే విషయమై రెవెన్యూ అధికారులను సంప్రదించే ప్రయత్నం చేయగా, భూకబ్జాదారుల్లో ఒకరైన తుర్కయంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ భర్త కుంట గోపాల్ రెడ్డి నుంచి బెదిరింపులు రావడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఈ విషయం ఒక్కసారి పరిశీలిస్తే భూకబ్జాదారులు, రెవెన్యూ అధికారుల మధ్యనున్న సంబంధం ఏపాటిదో ఇట్టే అర్ధమవుతోంది. సర్వే నెంబర్ 323 ప్రభుత్వ భూముల్లో ప్రస్తుతం ఒక రియల్ వెంచర్ వెలిసింది. ఈ రియల్ వెంచర్ పూర్తిగా ప్రభుత్వ భూముల్లో వెలిసిందన్న విషయం తెలిసి కూడా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయకపోవడం వెనుక మర్మం ఏమిటో సమాధానం చెప్పాలి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో ఎకరా 10 కోట్లు అనుకున్నా, ఐదు ఎకరాల్లో విస్తరించిన ఈ రియల్ వెంచర్ విలువ రూ. 50 కోట్లకు పైచిలుకు మాటేనని స్థానికులు అంటున్నారు. ఇకపోతే కౌన్సిలర్ కుటుంబం నివసిస్తున్న బహుళ అంతస్థుల భవనం కూడా ప్రభుత్వ భూమిలోనే ఉన్నదన్న టాక్ విన్పిస్తోంది. తుర్కయంజాల్ గ్రామ పంచాయితీగా కొనసాగిన సమయం నుంచి గోపాల్ రెడ్డి ఈ కబ్జాల పర్వానికి తెర లేపాడన్న వాదనలు విన్పిస్తున్నాయి. అయితే అప్పటి నుంచి ఆయన రెవెన్యూ అధికారులకు మామూళ్లు సమర్పించుకుంటూ, సర్వే నెంబర్ 323 ప్రభుత్వ భూముల్లో కొనసాగే నిర్మాణాల వైపు కన్నెత్తి చూడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. అధికారులు మారినా, ఎవరు కూడా తన భూకబ్జాలను అడ్డుకోకుండా మచ్చిక చేసుకోవడంలో ఆయన ఆరితేరిపోయారని స్థానికులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సంస్కరణలు తీసుకు వచ్చామని అధికార తెరాస చెబుతున్నప్పటికీ, తుర్కయంజాల్ లో మాత్రం ఆ సంస్కరణలు ఏవీ అమలుకు నోచుకోవడంలేదని అంటున్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి గెజిట్ లో నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ , గోపాల్ రెడ్డి లాంటి కబ్జాదారులు మాత్రం బై నెంబర్లతో ప్రభుత్వ భూములను చెరపడుతున్నారు . ఈ విషయం రెవెన్యూ ఉన్నతాధికారులకు తెలిసినా రాజకీయాలకు తలొగ్గి, ఈ భూముల పరిరక్షణకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భూములను కొనుగోలు చేసి, సొంత ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తున్న సామాన్యులకు రేపు ఏదైనా సమస్య తలెత్తితే దానికి ఎవరు బాధ్యులన్న ప్రశ్నకు సమాధానం కరువవుతోంది . అందుకే సర్వే నెంబర్ 323 ప్రభుత్వ భూములు, బైనెంబర్ల కథాకమీషు గురించి క్రైమ్ మిర్రర్ పత్రిక వెలుగులోకి తీసుకువచ్చి సామాన్యులకు అండగా నిలవాలని నిర్ణయించింది. మా ఈ ప్రయత్నాన్ని ఎవరు ఏ విధంగా అర్థం చేసుకున్నా మాకు వచ్చే నష్టం ఏమీ లేదు… కానీ సామాన్యులకు అండగా నిలవాలన్న మా ఈ ప్రయత్నాన్ని హర్షించే వారు ఈ సర్వే నెంబర్ వెనకనున్న గూడుపుఠాణి గురించి మరిన్ని వివరాలు అందించాలని కోరుతున్నాం…