
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : కాళేశ్వరం పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ తొలుత సతీసమేతంగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు దగ్గరుండి సీఎం దంపతులతో స్వామివారికి అభిషేకం చేయించి, ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు కాళేశ్వరం చేరుకున్న కెసిఆర్ దంపతులకు హెలిపాడ్ వద్ద మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు స్వాగతం పలికారు… కాగా, సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో పాటు పలువురు ఉన్నారు. ఈ పర్యటనలో కాళేశ్వరం రిజర్వాయర్‌ను పరిశీలించనున్నారు. అటు తరువాత లక్ష్మీ బరాజ్‌కు చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగికి సాగునీటి విడుదల తదితర అంశాలపై అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. యాసంగి పంటలకు సరిపడా సాగునీటిని అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తారు. బరాజ్ వద్ద భోజనం చేసిన అనంతరం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగివస్తారు.