
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : ఫిబ్రవరి 1వ తేదీ నుండి 9వ తరగతి నుండి ఆపై తరగతులను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. మంత్రులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు, ఆయాశాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ రెవెన్యూకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అన్నిశాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాలు నిర్మించాలని సీఎం ఆదేశించారు.