
ప్రోటోకాల్ ఫైట్ విపక్ష ప్రజాప్రతినిధులను విస్మరిస్తున్న అధికార పార్టీ నాయకులు
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో తరచు ప్రోటోకాల్ పై రగడ కొనసాగుతూనే ఉంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వారికి అనుకూలంగా వ్యవహరించే అధికారుల అత్యుత్సాహం వల్ల ప్రోటోకాల్ పంచాయితీ నిత్య కృత్యం ఐపోయింది. ప్రభుత్వం తరఫున నిర్వహించే ఏ కార్యక్రమానికైనా, రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రజా ప్రతినిధులు అందరిని ఆహ్వానం చాల్సిన బాధ్యత అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల ది. అయితే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులు విపక్ష ప్రజా ప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయకుండా దూరం పెట్టేందుకు తమ ఇష్టా రీతిలో వ్యవహరించడం వల్లే తరచు ప్రోటోకాల్ వార్ కొనసాగుతోంది. అభివృద్ధి కార్యక్రమాల్లో తమను కూడా భాగస్వాములను చేయాలని చట్టప్రకారం తమకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వాలని విపక్ష సభ్యులు కోరుతున్నారు. అయినా ఏలికలో. ఉన్న పాలకులు అదేమీ తమకు పట్టనట్లు వ్యవహరిస్తుండడం వల్లే విమర్శలకు గురి కావాల్సి వస్తోంది. ఇటీవల సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్న అభివృద్ధి కార్యక్రమాల్లో తనని భాగస్వామిని చేయలేదంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే, శనివారం ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట డివిజన్లో వాటర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిర్దేశించిన సమయం కంటే ముందే మంత్రులు కేటీఆర్ మల్లారెడ్డి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లు హాజరై ప్రారంభోత్సవం చేయడాన్ని స్థానిక ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ముందు నిర్దేశించిన సమయం కంటే ఎలా ప్రారంభోత్సవం చేస్తారంటూ ఆయన స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ని నిలదీశారు. అంతా మీ ఇష్టమేనా అంటూ ప్రశ్నించారు. అధికారులపై తమాషాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీ కి ముందుగానే అభివృద్ధి కార్యక్రమాల గురించి సమాచారం అందజేసి ఆయన హాజరు కాకముందే ప్రారంభం చేయడాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో విపక్ష ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయొద్దన్న కుట్ర ఇందులో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రజా నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న అప్పుడు ప్రతిపక్ష సభ్యులను కూడా కలుపుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొంటున్నారు. విపక్ష సభ్యులకు ప్రజల్లో తగిన గుర్తింపు లభించకుండా అడ్డుకోవాలన్న అధికార పార్టీ కుట్రను ప్రజాస్వామ్యవాదులు అంతా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదని వివరిస్తున్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు ముఖ్యంగా అధికారులు కళ్లు తెరిచి ప్రోటోకాల్ మర్యాదలను పాటించాలని లేకపోతే రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా ఇదే విధంగా వ్యవహరిస్తారని నిజాన్ని గ్రహించాలని రాజకీయ పరిశీలకులు పలుకుతున్నారు.
One Comment