
మెయిన్ రోడ్డుపై అనుమతులు లేకుండా భారీ షెడ్డు నిర్మాణం
వార్డు కౌన్సిలర్ భర్త గోపాల్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా బట్ట బయలు
ప్రశ్నించిన మీడియా ప్రతినిధి పట్ల దురుసు ప్రవర్తన
మూడేళ్ల కింద అనుమతి తీసుకున్నట్టు ఓ అక్రమ వెంచర్
క్రైమ్ మిర్రర్ నిఘాలో వెలుగులోకి అక్రమాలు
సామాన్యుడు 60 గజాలలో అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణం చేపడితే ఆగమేఘాల మీద వెళ్లి కూల్చివేసే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు , ప్రధాన రహదారి పక్కనే నిర్మిస్తోన్న షెడ్డు వైపు కన్నెత్తి చూడకపోవడంలో ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడంలేదు. ఈ షెడ్డు నిర్మాణానికి అనుమతులు ఉన్నాయని చెబుతున్నా… మున్సిపల్ నుంచి అనుమతులు మంజూరు చేసే అవకాశం లేకపోవడంతో , హెచ్ఎండీఏ నుంచి పొందాల్సి ఉంటుంది. హెచ్ఎండీఏ నుంచి అనుమతి పొందినా , నిబంధనలు పూర్తిగా విస్మరించి నిర్మిస్తోన్న ఈ షెడ్డు నిర్మాణం వెనుక కాంగ్రెస్ కౌన్సిలర్ భర్త ప్రమేయం ఉండడం వల్లే అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తుర్కయంజాల్ మున్సిపాలిటీ అవినీతికి అడ్డాగా మారింది. షాడో చైర్మెన్లుగా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులు అనుకున్నదే ఫైనల్. వారు ఏదనుకుంటే అదే కరెక్ట్. బడా వ్యాపారులు భారీగా ముట్టజెప్పుతుండటంతో వారి జోలికి వెళ్లకుండా, పేదల ఇళ్లపై ప్రతాపం చూపుతున్నారు. అధికారులూ ప్రజాప్రతినిధులకు వంతపాడుతుండటంతో అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. తుర్కయంజాల్‌లో ముఖ్యంగా 20వ వార్డులో వెలసిన భారీ నిర్మాణాలు, వెంచర్లు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. పెట్రోల్ బంకు పక్కన ఏర్పాటు చేస్తున్న భారీ షెడ్డు నిర్మాణంలో పెద్ద ఎత్తున తాయిలాలు చేతులు మారాయని తెలుస్తోంది. ఆ షెడ్డు తన కనుసన్నల్లో ఏర్పాటు చేస్తున్నామని, ఎవరూ అటువైపు కన్నెత్తి చూడొద్దని కౌన్సిలర్ భర్త గోపాల్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్థానికంగా ఉన్న ఓ ప్లానర్ ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని, ఆయనే డబ్బులు పంచినట్టు తెలిసింది. ఈ షెడ్డులో పెద్ద ఎత్తున బార్ అండ్ రెస్టారెంట్ నెలకొల్పేందుకు ప్లాన్ చేస్తున్నారు. విషయం ముందే తెలిస్తే ఇంకా భారీగా చేతులు మారే వీలుందని పసిగట్టి బయటకు పొక్కనీయడం లేదు. దీనిపై వివరణ అడిగేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధిపై కౌన్సిలర్ భర్త గోపాల్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. వివరణ ఇచ్చేందుకు ససేమిరా అంటూ దుర్భాషలాడారు.
ఇదే వార్డులోని తుర్కయంజాల్ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 323లో ఏర్పాటు చేస్తున్న వెంచర్ కు ఫేక్ అనుమతులు తీసుకుని పనులు చేస్తున్నారు. అధికారులను, స్థానిక లీడర్లను మేనేజ్ చేసి మూడేళ్ల కిందటే అనుమతి తీసుకున్నట్లు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి పనులు ముమ్మరం చేశారు. దాదాపు ప్లాట్ల అమ్మకం కూడా పూర్తి అయినట్లు సమాచారం. సుమారు రెండెకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న ఈ వెంచర్ లో ఎలాంటి మౌలిక వసతులకు చోటు కల్పించలేదు. ముఖ్యంగా డ్రైనేజీని బయటికి పంపేందుకు ప్లానింగే లేదు.. ఈ వార్డులో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ గుర్తించి చాలా చోట్ల కూల్చి వేయించారు. అప్పటికే కౌన్సిలర్ కు భారీగా ముడుపులు అందినందున దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. డబ్బులు ఇచ్చిన వారు తిరగబడటంతో కౌన్సిలర్ భర్త గోపాల్ రెడ్డి దగ్గర ఉండి మరీ మళ్లీ పనులు పూర్తి చేయిస్తున్నారు. తులిప్ గ్రాండ్ పక్కన నిర్మిస్తున్న షెట్టర్లే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. అక్రమ నిర్మాణాలను సహించేది లేదని, అక్రమార్కులను వదిలిపెట్టబోమని ఊకదంపుడు ప్రసంగాలు చేసే మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇవి కనిపించడం లేదా ప్రజలు అని ప్రశ్నిస్తున్నారు…