
క్రైమ్ మిర్రర్ న్యూస్ : తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయంటూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలని ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. తన ఛాంబర్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన పలు అంశాల గురించి తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. పార్టీలోని సామాన్య కార్యకర్త స్థాయి వాళ్లతో కూడా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. డైనమిక్ లీడర్. ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించగలరు. ప్రత్యర్థులను తన వాక్చాతుర్యంతో ఇరుకున పెట్టగలరు. ప్రసంగాలతో ప్రజలను ఆకర్షించగలరు. అడ్మినిస్ట్రేషన్ సామర్థ్యం ఉంది. పనిచేసే సత్తా ఉంది. పట్టుదల ఉంది. సీఎం పదవికి అర్హుడు అనేందుకు ఇంతకంటే కేటీఆర్ కు ఇంకే అర్హతలు కావాలి..‘ అంటూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
అదే సమయంలో రాబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తనను పోటీ చేయమని ఎవరూ సంప్రదించలేదని గుత్తా చెప్పుకొచ్చారు. ’నన్నెవరూ పోటీ చేయమని ఇంతవరకు అడగలేదు. నేను కూడా పోటీ చేస్తానని కేసీఆర్ ను అడగలేదు. ఈ ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తే బాగుంటుందన్నది కూడా నేనెవరికీ చెప్పలేదు.‘ అని గుత్తా తేల్చిచెప్పారు. అదే సమయంలో ఈ ఏడాది జూన్ లో ఎమ్మెల్సీగా తన పదవీ విరమణ ఉంటుందని విలేకరులకు వెల్లడించారు. ఆ తర్వాత తన సేవలను కేసీఆర్ ఎలా వినియోగించుకోవాలనుకుంటే అలా పార్టీ కోసం పనిచేస్తానని గుత్తా వివరించారు. రాజకీయాల్లో పొగడ్తల వెనుక పరమార్థం ఉంటుందన్న నానుడి ఉండనే ఉంది. సడన్ గా కేటీఆర్ పై గుత్తా సుఖేందర్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించడం వెనుక కూడా మర్మం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరో ఆరు నెలల్లో గుత్తా ఎమ్మెల్సీగా గుత్తా పదవీకాలం ముగియనుంది. ఈ లోపే నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఆ ఎన్నికల్లో తనకు ఛాన్స్ ఇస్తే పోటీ చేయాలని గుత్తా ఆలోచనగా చెబుతున్నారు. అది నేరుగా కేసీఆర్ ను అడగలేక, మీడియా ద్వారా ఆయనకు సమాచారం చేరవేయాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో.. వేచి చూడాలి.