
క్రైమ్ మిర్రర్ న్యూస్ : తరగతి గదిలో జరిగిన గొడవ ఓ బాలుడి ప్రాణాలు తీసింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. క్లాస్ రూములో సీటు కోసం ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మధ్య సీటు కోసం నిన్న ఘర్షణ పడ్డారు. దీంతో కోపంతో రగలిపోయిన బాలుడు ఈ ఉదయం స్కూలుకు వస్తూవస్తూ తన అంకుల్ తుపాకిని వెంట తెచ్చుకున్నాడు. వచ్చీ రావడంతో తనతో గొడవకు దిగిన స్నేహితుడిపై కాల్పులు జరిపాడు. రెండు పిరియడ్లు ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం మూడుసార్లు కాల్పులు జరిపాడని, ఒక తూటా పొట్టలోకి, మరోటి చాతీలోకి, ఇంకొకటి తలలోకి దూసుకుపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్టు చెప్పారు. కాల్పుల అనంతరం పారిపోవడానికి నిందితుడు ప్రయత్నించాడు. పై అంతస్తు నుంచి కిందికి వచ్చిన తర్వాత తనను పట్టుకునేందుకు వచ్చిన వారిని బెదిరించేందుకు గాల్లోకి కాల్పులు జరిపినట్టు పోలీసులు పేర్కొన్నారు. చివరికి ఉపాధ్యాయులు అతడి కష్టం మీద బాలుడిని పట్టుకుని తుపాకి లాక్కున్నారు. అయినప్పటికీ అతడు వారిని నుంచి తప్పించుకున్నాడు. అప్పటికే పోలీసులకు సమాచారం అందడంతో వారొచ్చి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడైన బాలుడి నుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దానిని అతడు తన అంకుల్ నుంచి దొంగలించి తీసుకున్నట్టు గుర్తించారు. బాలుడి అంకుల్ ఆర్మీలో పనిచేస్తుంటారని, సెలవులపై ఆయన ఇంటికి రాగా, ఆయన లైసెన్స్‌డ్ తుపాకిని తెలియకుండా తీసుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సీనియర్ పోలీసు అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. బాలుడి పుస్తకాల సంచిలో నాటు తుపాకి కూడా ఉందని, దానిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.