
స్థానికంగా బిల్డింగ్ ప్లానర్ తో కలిసి సెటిల్మెంట్లు…
చర్యలు తీసుకోవడానికి వెళ్లిన అధికారుల పై ఒత్తిళ్లు.
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తుర్కయంజాల్ పరిధిలో జరుగుతున్న అవినీతి , అక్రమాలను వెలికి తీయాల్సిన ఓ విలేకరి పక్క దారి పట్టాడు. మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలకు మద్దతు తెలుపుతున్నాడు. బాగా పాతుకుపోయిన ఓ బిల్డింగ్ ప్లానర్ ను అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవడానికి వెళ్తే వెంటనే ఆ విలేకరి , ప్లానర్ రంగంలోకి దిగుతారు. చర్యలు తీసుకోవద్దని ఒత్తిడి తెస్తారు. తాజాగా రాగన్న గూడ లోని జీ వీ ఆర్ నగర్ కాలనిలో చేపడుతున్న రెండు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి అధికారులు వెళ్ళగానే వెంటనే రంగంలోకి దిగి వెనక్కి తగ్గేలా చేశారు.
ఆయన పేరు చెప్తే వెంటనే అనుమతులు….
మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల నిర్మాణాల అనుమతులను ఇప్పించటంలో ఆ విలేకరి, ప్లానర్ యజమాని ఇద్దరు భాగస్వామ్యలు. ప్లానర్ నేరుగా వెళ్తే తొందరగా పని పూర్తి కాదు అన్న భావనతో ఆ విలేకరిని అడ్డుపెట్టుకుని తొందరగా పూర్తి చేస్తారు. ఆయన పేరు చెప్తే వెంటనే మంజూరు కావాల్సిందే. లేదంటే అధికారుల వద్దకు వెళ్లి ఆవేశం వెళ్లగక్కుతాడు. ఎందుకొచ్చిన గొడవ రా బాబు అని అనుకునే అధికారులు వెంటనే సంతకాలు పెట్టి ఫైల్ ఫైనల్ చేసేస్తారు. ఇలా ఒక ఫైల్ అప్రూవల్ చేయించగా వచ్చిన డబ్బులు చేరిసగం పంచుకుంటూ అక్రమ దందాకు తెరలేపారు.
అతనికి ఒక్కడికే కడుపు ఉన్నట్టు…
ఆ విలేకరి పెద్ద పేపర్ లో పని చేస్తాడు కాబట్టి ఆయన రాసిందే కరెక్ట్ అని, ఆయన పేపర్ లో వస్తేనే ఏదైనా జరుగుతుందని మిగతా విలేకరులు, పేపర్ లు వేస్ట్ అని అధికారులు, నాయకులకు నూరి పోయడంలో ఆయన దిట్ట. ఆయన ఒక్కడే గొప్ప అని మిగతా వారు ఎం రాసిన ఎం కాదు అని, అసలు కనీసం స్పందించాల్సిన అవసరం లేదని అంటాడు. కొన్నిసార్లు మరింత ముందడుగు వేసి మిగతా విలేకర్ల పై యాజమాన్యాలకు పిర్యాదు చేయిస్తాడు. లేదా లీగల్ నోటీసులు ఇప్పించి బెదిరిస్తాడు. ఇంత జరుగుతున్నా ఆయన పని చేసే యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడంతో రోజురోజుకు ఆయన ఆగడాలు పెరిగిపోతూనే ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం అప్పుల్లో కూరుకుపోయిన ఆయన నేడు అక్రమ సంపాదన తో కోట్లకు పడగలెత్తడం గమనార్హం