
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ఛాన్స్
భాజపా పై విజయావకాశాలు పై ప్రభావం
భాజపా ఓట్లు భారీగా చీల్చ నున్న తాళ్ళ శ్రీశైలం
రాజకీయాలకు ఇన్నాళ్లు దూరంగా ఉన్న పవన్
చేరిన వెంటనే టికెట్ ఇవ్వడం పై క్యాడర్ లో అసంతృప్తి
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : కొత్తపేట డివిజన్ లో కాంగ్రెస్ పుంజుకుంటుంది. దీనితో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రమాదం ఉంది. అదే జరిగితే భాజపా అభ్యర్థి పవన్ కుమార్ విజయావకాశాలు పై తీవ్ర ప్రభావం చూపనుంది. దానికి తోడు కొత్తపేట విలేజ్ లో టీడీపీ అభ్యర్థి తాళ్ళ శ్రీశైలం గౌడ్ , భాజపా ఓట్లకు భారీగా గండి కొట్టే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గతం లో ఎల్ బీ నగర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ పని చేసిన పవన్ ఆ తరువాత రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించకుండా, వ్యాపార రంగంపై దృష్టి సారించారు. ఎన్నికల ముందు బీజేపీ లో చేరిన ఆయనకు టికెట్ కేటాయించడం పట్ల క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేసిన వార్ని కాదని ఎన్నికల ముందు పార్టీ లో చేరిన వారికి టికెట్ ఇస్తే తాము ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలని ప్రశ్నిస్తున్నారు. గతం లో ఈ సంస్కృతి కాంగ్రెస్ లో ఉండేదని , ఇప్పుడు భాజపా కు పాకిందని మండిపడుతున్నారు . డబ్బులు ఉన్నాయని పార్టీ లో చేరిన వెంటనే టికెట్ ఇస్తే , ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసి పోలీసు కేసులు, లాటి దెబ్బలు తిన్న వారి పరిస్తితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు . పార్టీ లో చేరిన రెండవ రోజే పవన్ కు టికెట్ ఇవ్వడం వల్ల ఈ రోజు ప్రజల్లో భాజపా పలచన అయిందని అంటున్నారు. లేకపోతే ప్రస్తుత కార్పొరేటర్ సాగర్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకత కు భాజపా సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు ఉండేవని, కానీ పార్టీ లో చేరిన వెంటనే పవన్ కు టికెట్ ఇవ్వడం వల్ల ఎదురు ఈదాల్సి న పరిస్తితి నెలకొందని భాజపా కార్యకర్తలే అంటున్నారు.