
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ భారత సంతతికి చెందిన మరో మహిళకు కీలక పదవిని కేటాయించారు. భార్య జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన మాలా అడిగాను నియమించారు. ఈమె గతంలోనూ జిల్ బైడెన్‌కు సీనియర్ సలహాదారుగా, బైడెన్- కమలా హ్యారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాలసీ సలహాదారుగానూ, బైడెన్ ఫౌండేషన్ డైరెక్టర్‌గానూ సేవలందించారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్‌కి మాలా డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత డిఫెన్స్‌లో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌కి సీనియర్ సలహాదారుగానూ సేవలందించారు.
ఇల్లినాయిస్‌కు చెందిన మాలా అడిగా మిన్నెసోటా స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. న్యాయవాదిగా శిక్షణ పూర్తిచేసి చికాగోలో పనిచేసిన మాలా 2008లో అధ్యక్షుడు బరాక్ బబామా క్యాంపెయిన్‌లోనూ ముఖ్యపాత్ర పోషించారు. తర్వాత అటార్నీ జనరల్‌కు సలహాదారుగానూ వ్యవహరించారు. జో బైడెన్ తాజాగా వైట్‌హౌస్‌లో నలుగురు అధికారులను నియమించారు. వారిలో లూయిసా టెర్రెల్ వైట్ హౌస్ లెజిస్లేటివ్ అఫైర్స్ డైరెక్టర్‌గా వ్యవహరించనుండగా, కార్లోస్ ఎలిజోండో వైట్ హౌస్ సామాజిక కార్యదర్శిగా పనిచేయనున్నారు. తన బృందంలోని సభ్యులు అమెరికన్ ప్రజలకు మరింత సేవ చేస్తారని బైడెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో మరింత అంకితభావంతో పనిచేస్తారని బైడెన్ అన్నారు.