తెలంగాణ

కవిత ఈజ్ బ్యాక్.. రేవంత్ పై ఖతర్నాక్ స్కెచ్!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. లిక్కర్ స్కాం కేసులో జైలుకు వెళ్లి.. బెయిల్‌ పై వచ్చిన కవిత.. చాలా రోజులు సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ జనంలోకి వెళ్లారు. ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురై నిమ్స్ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్న.. గురుకుల విద్యార్థిని శైలజ, కుటుంబసభ్యులను కవిత పరామర్శించారు.

అదిలాబాద్ టూ అలంపూర్ వరకు గురుకులాలన్ని కూడా అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. సీఎం సమీక్ష చేసిన మరుసటి రోజునే నారాయణ పూర్ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన తీరు పరిస్థితి తీవ్రతకు నిదర్శనమన్నారు. కేసీఆర్ పాలనలో గురుకుల పాఠశాలల విద్యార్థులు గొప్పగా చదువుకోవడం జరిగిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో 11నెలల్లోనే 42మంది చనిపోవడం బాధకరమన్నారు.

జైలు నుంచి వచ్చిన తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు కవిత. ఏ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే గత రెండు, మూడు రోజులుగా ఆమె మళ్లీ కనిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం సమగ్ర కులగణన సర్వేలో భాగంగా తన ఇంటికి వచ్చిన ఎమ్యునరేటర్లకు స్వయంగా వివరాలు అందించారు. శుక్రవారం జాగృతి సంస్థ ప్రతినిధులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తాజాగా నిమ్స్ కు వెళ్లి గురుకుల విద్యార్థులను పరామర్శించారు. అదానీపై అమెరికాలో కేసు నమోదైన ఘటనపైనా స్పందిస్తూ అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా మోడీ అంటూ ప్రధానిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. కవిత మళ్లీ దూకుడు పెంచడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆమె అభిమానులు ఖుషి అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button