చండూరు, క్రైమ్ మిర్రర్: చండూరు మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణాన్ని శెనగకుంట కింది భాగంలో ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. రూ. 2 కోట్ల నిధులతో నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కాగా ఏడాది కాలంగా భవనం అసంపూర్తిగానే ఉండిపోయింది. పిచ్చి మొక్కలు పెరిగి అద్వానకరంగా మారింది. ప్రస్తుతం మున్సిపాలిటీ కార్యాలయాన్ని గ్రామపంచాయతీ భవనంలోనే నిర్వహిస్తున్నారు. ఇరుకైన గదులతో ఎందుకు సరిపోవడం లేదు. నూతన భవన నిర్మాణం జరిగితే కార్యాలయాన్ని మార్చాలని అధికారులు ఎదురుచూస్తున్నారు. వారి కోరిక ఇప్పట్లో తీరేలా కనబడటం లేదు. ఇప్పటివరకు నిర్మాణం కోసం 50 లక్షలు ఖర్చు చేశారు. పెట్టిన డబ్బులకు బిల్లులు రాకపోవడంతో సదరు గుత్తేదారుడు పనులను మధ్యలోనే నిలిపేశారు.
అసలు ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తారా లేక అలాగే వదిలేస్తారా అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. నూతన భవన నిర్మాణాన్ని ఇక్కడ కాకుండా మరోచోటికి మారుస్తారు అనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి. సరే మరొక చోటికి కార్యాలయ నిర్మాణాన్ని మారిస్తే మార్చారు. కానీ ఇప్పుడున్న అసంపూర్తి నిర్మాణాన్ని పూర్తి చేస్తే ప్రజా అవసరాల కోసం లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉపయోగపడుతుందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు చండూరులో అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలను ఇతర ప్రభుత్వ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.