
Bombay High Court: కోర్టులు ఇచ్చే తీర్పులు కొన్నిసార్లు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. బాంబే హైకోర్టు కూడా తాజాగా అలాంటి ఓ తీర్పు ఇచ్చింది. భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చిన వెల్లడించింది. అంతేకాదు, వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానిస్తూ మానసిక వేదనకు గురిచేసినా డివోర్స్ ఇచ్చేందుకు ఆ భర్త అర్హుడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఓ మహిళ విడాకులకు సంబంధించి ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. ఓ జంటకు 2013లో పెళ్లైంది. కానీ, 2014 నుంచి వారిద్దరు వేరు వేరుగా ఉంటున్నారు. తన భార్య శృంగారానికి నిరాకరిస్తోందని, వేరే మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నట్లు అనుమానిస్తోందని ఆమె భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగుల ముందు అవమానించి మానసిక వేదనకు గురి చేస్తోందన్నాడు. తనకు విడాకులు ఇవ్వాలని కోరుతూ 2015లో పూణేలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం విడాకులు మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేసిన భార్య
ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును సదరు భార్య బాంబే హైకోర్టులో సవాలు చేసింది. అత్తామామలు వేధిస్తున్నారని కోర్టుకు వెల్లడించింది. తన భర్త మీద ప్రేమ ఉందని, పెళ్లిన వదులుకోవడం ఇష్టం లేదని చెప్పింది. అంతేకాదు, ప్రతి నెల రూ. లక్ష భరణం ఇప్పించాలని కోరింది. ఈ పిటిషన్ ను జస్టిస్ రేవతి మోహితే, జస్టిస్ నీల గోఖలేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా సదరు మహిళ ప్రవర్తన ఆమె భర్తను మానసిక వేదనకు గురి చేసేలా ఉందని తేల్చిచెప్పింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది.
Read Also: భారత అమ్ముల పొదిలోకి మరో రెండు బాలిస్టిక్ మిస్సైల్!